Site icon NTV Telugu

Cockfight: కోడి పందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న రాజమండ్రి వాసి..

Cockfight

Cockfight

Cockfight: సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రెండో రోజు నిర్వహించిన కోడి పందాలు భారీగా సాగాయి. లక్షలాది రూపాయలు పందాల్లో పెట్టగా, కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా రూ.1 కోటి 53 లక్షల భారీ పందెం కుదిరింది. ఈ పందెం గుడివాడ ప్రభాకర్ సేతువ మరియు రాజమండ్రికి చెందిన రమేష్ డేగ మధ్య జరిగింది. హోరాహోరీగా సాగిన పోటీలో చివరకు రాజమండ్రి రమేష్ డేగ విజయం సాధించింది.

Read Also: Harsha Richaria: సాధ్వి టూ మోడల్.. హర్షా సన్యాసానికి ఎందుకు గుడ్‌బై చెప్పింది?

ఈ భారీ పందెన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పందెం రాయుళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా పందెం ప్రేమికులు భారీగా వచ్చారు. దీంతో బరులు కిటకిటలాడాయి. సంక్రాంతి కోడిపందాలు గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా నిర్వహించబడుతుండగా, ఈ ఏడాది మరింత ఉత్సాహంగా సాగుతున్నాయి. పందాల్లో వేలాది కోళ్లు నేలకొరగగా, కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. పందెం రాయుళ్లు భారీ మొత్తాల్లో పందాలు కడుతూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ, కోడిపందాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తం మీద సంక్రాంతి పండుగ వాతావరణంలో కోడి పందాలు గోదావరి జిల్లాల్లో ప్రధాన ఆకర్షణగా మారాయి.

Exit mobile version