AP TS Projects: భారీగా కురుస్తున్న వర్షాల వల్ల తెలుగురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రాజెక్టులకు ఇంకా వరద కొనసాగుతోంది. గోదావరి, కృష్ణతో పాటు వాటి ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉరకలెత్తుతున్న వాగుల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తిగా నిండి.. వరద దిగువకు ఉరకలెత్తుతోంది. భారీ ప్రవాహంతో భారీ తరహా ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతుండగా.. కొన్ని ఇప్పటికే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు సంబంధించిన నీటి వివరాలు ఇలా ఉన్నాయి.
జూరాల ప్రాజెక్టు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 44 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2,68,568 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2,67,665 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,042.782 అడుగులుగా ఉంది. పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.300 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఎత్తి పోతల పథకాలకు అధికారులు నీటిని విడుదల చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. 4 వరద గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1089 అడుగులుగా ఉంది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 82 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 3154 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 3914గా ఉంది. ఒక్క గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 692.350 అడుగులుగా ఉంది. పూర్తి నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.760 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. 24క్రస్ట్ గేట్లు10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తు్న్నారు. ఇన్ ఫ్లో 3,93,255 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 3,93,255 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 300 టీఎంసీలుగా ఉంది.
Godavari at Bhadrachalam: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. 54.3 అడుగులకు నీటి మట్టం
శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతూ వస్తోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,17,736 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 3,77,382 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 209.1579 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 14.70 అడుగులకు చేరింది. 14 లక్షల 15వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు నుంచి 12గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3లక్షల 76వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 3లక్షల 24వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 39.26 టీఎంసీలుగా ఉంది.
సుంకేసుల జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 77,221 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 75,126 క్యూసెక్కులుగా ఉంది. 19 గేట్ల ద్వారా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. డ్యాం సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.669 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
