Botsa Satyanarayana: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైద్య విద్యను ప్రయివేటు చేతుల్లో పెట్టే ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు.. వైద్యాన్ని ప్రయివేటు పరం చేయొద్దు అని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ఉద్యమం చేపట్టినట్టు బొత్స తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సంతకాల పత్రాలను త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌కి అందజేస్తామని చెప్పారు.
Read Also: Harish Rao : ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు.. గోబెల్స్ సమ్మిట్
ప్రపంచంలో ఎక్కడా వైద్యాన్ని ఇలా పూర్తిగా ప్రయివేటు వారికి అప్పగించడం జరుగదు అన్నారు బొత్స.. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు పక్కనపెట్టి, కార్పొరేట్ స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడూ కార్పొరేట్ వారికే మొగ్గు. ఇది కొత్తేం కాదు.. ఆయన నైజం ఎప్పటినుంచో ఇదే అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు తగ్గితే, పేదలకు వైద్య విద్య అందడం కష్టమవుతుందని బొత్స హెచ్చరించారు. తమ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను తీసుకువచ్చినదే పేదలకు అవకాశాలు కల్పించడానికేనని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఒక పిడికెడు బుగ్గి కూడా ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు పెట్టలేదు. ఇలా కొనసాగితే MCI అనుమతులే రాకపోవచ్చు అని అన్నారు.
అవసరమైతే వైద్య కళాశాలల కోసం ప్రత్యేక చట్టం చేస్తాం..
వైద్య కళాశాలల కొనసాగింపుపై గవర్నర్‌కు వివరించి, అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావడానికి కూడా వెనుకాడమని చెప్పారు బొత్స.. ప్రస్తుత ప్రభుత్వ వైద్య విధానాలు పూర్తిగా ప్రజా వ్యతిరేకమని ఆరోపించారు. ఇక, రాష్ట్రానికి రెండు లక్షల అరవై వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, ఆ డబ్బుల లెక్కలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పు చేసిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు? శ్వేతపత్రం విడుదల చేయండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు.. వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన 18,000 కోట్లను మాత్రమే చూపిస్తూ మిగతా వివరాలను దాచేస్తున్నారని విమర్శించారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుకు ఇచ్చిన రంగాలు ఎలా దుస్థితికి గురవుతున్నాయో చూపించేందుకు Air India ఉదాహరణ ఇచ్చారు బొత్స.. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పైలెట్ ఎన్ని గంటలు పని చేసి ఉంటాడో కూడా అనుమానం వచ్చేలా పరిస్థితి చేశారు అన్నారు. SOP అమలుకు ఇంకా రెండు నెలలు పట్టుతుందని కేంద్రం చెబితే, ఈలోగా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన పూర్తిగా తప్పని బొత్స తెలిపారు. ప్లాంట్‌కు గనులు కేంద్రం సమకూర్చాలని ప్రభుత్వం అడుగుతోంది. ఇది విడ్డూరం. అదే గనులు ఇస్తే ప్రస్తుత స్టీల్ ప్లాంట్లే మెరుగుపడేవి అన్నారు. రైతుల అభిప్రాయం కీలకమని, వెయ్యిమంది రైతులు అనుకూలంగా ఉంటే మాకు అభ్యంతరం లేదు.. ఎక్కువ శాతం వ్యతిరేకిస్తే మా పోరాటం కొనసాగుతుంది అని ప్రకటించారు బొత్స సత్యనారాయణ..
