ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కంటే ఎక్కువగా కరోనా ఆలోచనలు జనాల్ని వెంటాడుతున్నాయి. దీనితో మరింత అనారోగ్యపాలవుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు కేసు చేసుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.
వేపాడ మండలంలోని నల్లబిల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62) రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గుప్తాకు భార్య సత్యవతి (57), అత్త వెంకటసుబ్బమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె పూర్ణ ఉన్నారు. ఇటీవల సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతున్నారు. అయితే, రెండు రోజుల క్రితం భార్య సత్యవతికి కూడా జ్వరం వచ్చింది. దీంతో వారికి సేవలు చేసేందుకు చుక్కపల్లిలో ఉంటున్న కుమార్తె వచ్చింది. తమకు కరోనానే వచ్చిందని నిశ్చయించుకున్న గుప్తా దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పురుగు మందును తగిన ముగ్గురూ అనంతరం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.