NTV Telugu Site icon

Vizag TTD Temple: సాగరతీరాన అద్భుతంగా శ్రీవారి ఆలయం

విశాఖ సాగర తీరం తిరుమల వేంకటేశ్వర స్వామి నామస్మరణతో మరింతగా పులకించనుంది. భక్త కోటి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 23 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విషయం తెలిసి భక్తులు ఆనందపరవశులవుతున్నారు.

ఆధ్యాత్మిక శోభతో విశాఖ సాగరతీరం మరింత కమనీయంగా మారనుంది. సుప్రభాతం సేవతో మొదలుకొని..పవళింపు సేవ వరకు వెంకటేశ్వరుడి నామస్మరణతో విశాఖ నగరం పులకించనుంది. ఋషికొండ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ రుషికొండ సమీపంలోని 10 ఎకరాల స్థలంలో దేవాలయాన్ని నిర్మించారు. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ కోవెలను తీర్చిదిద్దారు. ఇందుకోసం సుమారు రూ.28 కోట్లు వెచ్చించారు.

ప్రధాన దేవాలయాన్ని ఒకటిన్నర ఎకరం స్థలంలో నిర్మించారు. నిత్యం పూజలతో పాటు భక్తుల దర్శనం, ప్రసాదాల విక్రయ కేంద్రం వంటి ఏర్పాట్లు చేశారు. మొదటి అంతస్తులో మహాలక్ష్మి, గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఇక స్వామి వారికి ఇరువైపులా అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. దిగువ అంతస్తులో ధ్యాన మందిరం, కల్యాణోత్సవ మండపం ఏర్పాటు చేశారు. స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు.

ఉత్తరాంధ్ర వైకుంఠంగా విశాఖలో వెంకటేశ్వర క్షేత్రం ఉండాలనే సంకల్పంతో 2019లో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టింది. శ్రీనివాసుడి విగ్రహం 7 ఆడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తయి చాలా కాలమే అయినా… సీఎం జగన్‌ బిజీగా ఉండడం, సరైన ముహూర్తం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం ఆలస్యమైంది. 22న నవకలశ స్నాపనం, బింబ వాస్తు, 23న ప్రధాన దేవతామూర్తులను ఆలయంలోనికి శాస్త్రబద్ధంగా చేర్చడంతో పాటు మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. సాగర తీరంలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ ప్రారంభిస్తుండటం పట్ల విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.