Vizag Court: విశాఖపట్నంలో సంచలనం రేకెత్తించిన ఆరు హత్యల కేసులో ఎట్టకేలకు సెన్సషనల్ తీర్పు వెలువరించింది సెషన్స్ కోర్టు.. 2021 ఏప్రిల్ 15వ తేదీన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జుత్తాడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుని అప్పలరాజు అనే వ్యక్తి అతి దారుణంగా నరికి చంపాడు.. పాత పగలు, కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.. అయితే, నాలుగేళ్ల తర్వాత నిందితుడు అప్పలరాజుకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది విశాఖ సెషన్స్ కోర్టు.. నిందితుడు అప్పలరాజుకు మరణశిక్ష విధించడంతో మృతుల కుటుంబ సభ్యులు ఎట్టకేలకు న్యాయం దక్కిందని తెలిపారు..
Read Also: Ayesha Meera Murder Case: ఆయేషా మీరా కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. సీబీఎన్‌కు ఆమె తల్లి విజ్ఞప్తి..
కాగా, ఒకే కుటుంబంలో ఆరుగురిని 2021లో హత్య చేశాడు బత్తిన అప్పలరాజు.. అప్పట్లో ఈ హత్యాకాండ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితుడు బత్తిన అప్పలరాజు.. బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అయితే, ఈ హత్యలకు రమణ కుమారుడు విజయ్ కిరణ్ కారణమేనని పోలీసులు నిర్ధారించారు. అప్పలరాజు కుమార్తెను బమ్మిడి రమణ కొడుకు విజయ్ కిరణ్ లవ్ చేశాడు.. ఇదే విషయంపై అప్పలరాజు.. రమణ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, 2018లో తన కుమార్తెపై విజయ్.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి ఆమెను మోసం చేశాడని.. అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. అంతటితో ఆగకుండా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడంటూ అప్పలరాజు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్‌ను అరెస్టు చేశారు. కేసు విచారణ సాగుతోన్న సమయంలో.. తన కుమార్తె జీవితం నాశనం కావడానికి, ఊళ్లో తన పరువు పోవడానికి బమ్మిడి రమణ కుటుంబమే కారణమని రగిలిపోయిన అప్పల రాజు.. ఎలాగైనా ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.. అయితే, ఏప్రిల్ 15న విజయ్ అత్త అల్లు రమాదేవి, విజయ్ భార్య బొమ్మిడి ఉషారాణి, ఆమె ఇద్దరు పిల్లలు ఉదయనందన్, రిషితను కిరాతకంగా హత్య చేశాడు. విజయ్ మేనత్త నెక్కళ్ల అరుణ, విజయ్ తండ్రి బమ్మిడి రమణ ఇలా వరుబెట్టి అందరినీ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు..
