Operation Firewall 2026: ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ చేపట్టిన ఆపరేషన్ ఫైర్‌వాల్–2026లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల్లోని రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ స్పై నెట్‌వర్క్ హనీ ట్రాప్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 10 రాష్ట్రాల్లో 12 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇప్పటివరకు 18 మంది పాత్రను గుర్తించినట్లు సమాచారం. వీరిలో సైలర్ ప్రదీప్ ముఖర్జీ, సివిలియన్ డ్రైవర్ సాయి వరప్రసాద్ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
దేశ నౌకాదళం, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని నిందితులు స్పై నెట్‌వర్క్‌కు చేరవేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా ఈ సమాచారాన్ని పాకిస్థాన్ నెట్‌వర్క్‌కు పంపినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. జోషితా పాల్, అన్విత మెహతా పేర్లతో నిందితులను హనీ ట్రాప్‌లోకి లాగినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని, అనంతరం సున్నితమైన సమాచారాన్ని సేకరించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
పాకిస్థాన్ స్పై నెట్‌వర్క్ ఇప్పటికే 10 రాష్ట్రాలతో పాటు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులు పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో నేరుగా సంప్రదింపులు కొనసాగించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించినట్లు సమాచారం. ఆపరేషన్ ఫైర్‌వాల్–2026పై కేంద్ర హోంశాఖ కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇప్పటికే జరిగిన, ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ కేసులో గుర్తించిన 18 మందిలో మిగిలిన 16 మంది పాత్రపైనా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నెట్‌వర్క్ పరిధి, నిందితుల మధ్య సంబంధాలు, సున్నితమైన సమాచార బదిలీకి సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.

