Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, పరిశ్రమలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మారిటైం రంగంలో ఆగ్నేయాసియా (ఆసియాన్) దేశాలతో బలమైన, శాశ్వత భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రం కోరుకుంటోందన్నారు. సముద్ర అనుసంధానం, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారానికి ఏపీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్, ఆగ్నేయాసియా దేశాల మధ్య శతాబ్దాల చరిత్ర కలిగిన సముద్ర వాణిజ్య సంబంధాలను ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సముద్ర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యత
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మారిటైం ఎకానమీకి అధిక ప్రాధాన్యత ఇస్తోందని లోకేష్ తెలిపారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 వంటి కార్యక్రమాల ద్వారా పోర్టులు, నౌకా నిర్మాణం, సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. భారత నౌకా నిర్మాణం, సముద్ర రంగాన్ని బలోపేతం చేసేందుకు సుమారు రూ.70 వేల కోట్ల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపిందని, ఇందులో రూ.25 వేల కోట్ల మారిటైం డెవలప్మెంట్ ఫండ్ కూడా ఉందని పేర్కొన్నారు. భారతదేశ వాణిజ్యంలో సుమారు 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోందని, అందువల్ల ఆధునిక పోర్టులు, నౌకాయాన మౌలిక సదుపాయాలు ఆర్థికాభివృద్ధికి కీలకమని చెప్పారు. ప్రతి కొత్త పోర్టు పరిశ్రమలు, వ్యాపారాలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు.
1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం.. ఏపీకి ప్రత్యేక అవకాశం
ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రధాన మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించిందని, దాదాపు 10 శాతం వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పోర్టులు రాష్ట్రంతో పాటు పొరుగు ప్రాంతాల పరిశ్రమలకు రవాణా, సరుకు ఎగుమతి సదుపాయాలను మెరుగుపరుస్తాయని వివరించారు. దుగరాజపట్నంలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడితో భారీ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇటీవల విశాఖలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినల్స్, షిప్ రిపేర్లకు సంబంధించి సుమారు రూ.7,500 కోట్ల విలువైన ఐదు మారిటైం అవగాహన ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు.
డిజిటల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ
సముద్ర ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ అనుసంధానం కీలక పాత్ర పోషిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నగరంలో గిగావాట్ స్థాయి ఏఐ హబ్, డేటా సెంటర్లు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థల ఏర్పాటుకు గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని వివరించారు. మూడు అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు విశాఖలో ల్యాండ్ కానున్నాయని తెలిపారు. రుషికొండలో సిఫీ సంస్థ అభివృద్ధి చేస్తున్న విశాఖ తొలి ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన విద్యార్థి దశలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ మీదుగా ప్రయాణించిన అనుభవాన్ని పంచుకున్నారని లోకేష్ ప్రస్తావించారు. అప్పటి ప్రశాంతమైన తీర నగరం నేడు అంతర్జాతీయ ఏఐ హబ్‌గా ఎదిగే దిశగా సాగుతోందని పేర్కొన్నారు.
స్మార్ట్ పోర్టులు.. ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహం
పోర్టుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ సాంకేతికతను వినియోగించడం ద్వారా సరుకు రవాణాలో జాప్యాన్ని తగ్గించవచ్చని, భద్రతను మెరుగుపరచవచ్చని మంత్రి తెలిపారు. స్మార్ట్ పోర్టులు, ఏఐ ఆధారిత లాజిస్టిక్స్, ఓషన్ రోబోటిక్స్ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. శ్రీసిటీ, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని, విశాఖ సమీపంలోని తర్లువాడలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు వివరించారు. బలమైన పోర్టులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం కలిసివస్తే ఆసియాన్ సరఫరా వ్యవస్థల్లో ఏపీ కీలక భాగస్వామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రీన్ ఎనర్జీలో ఏపీని సౌదీ అరేబియాగా తీర్చిదిద్దుతాం
స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తితో పాటు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియం ఎగుమతుల్లో రాష్ట్రాన్ని కీలక కేంద్రంగా మార్చాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని మరో సౌదీ అరేబియాగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఏటా సుమారు 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియంను జపాన్‌కు చెందిన జెరా సంస్థకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందని వివరించారు. గ్రీన్ ఫ్యూయల్స్, పర్యావరణహిత నౌకాయానం, సుస్థిర పోర్టుల అభివృద్ధిలో ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
2028 నాటికి 5 వేల మంది మారిటైం నిపుణులకు శిక్షణ
పెట్టుబడులతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ చెప్పారు. 2028 నాటికి 5 వేల మంది మారిటైం రంగ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని ఏపీ మారిటైం పాలసీ లక్ష్యంగా నిర్దేశించిందని తెలిపారు. షిప్ బిల్డింగ్, మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మారిటైం టెక్నాలజీ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీఐలు, ఆంధ్రా యూనివర్సిటీ సహా విద్యాసంస్థలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జువ్వలదిన్నె వద్ద మానవరహిత సముద్ర వ్యవస్థల అభివృద్ధికి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. ఐఐటీ తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో అక్కడ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సాంకేతికతలు సముద్ర భద్రత, పోర్టుల రక్షణతో పాటు మత్స్యకారులకు కూడా ఉపయోగపడతాయని వివరించారు.
ఆసియాన్ దేశాలతో నాలుగు రంగాల్లో భాగస్వామ్యం
భారత్, ఆసియాన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక, ఆర్థిక సంబంధాలను మరిన్ని వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యాలుగా మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని లోకేష్ అన్నారు. ముఖ్యంగా నాలుగు రంగాల్లో కలిసి పనిచేయడానికి ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇక, ఆసియాన్ దేశాల వ్యాపార ప్రముఖులు, పరిశోధకులు, ప్రతినిధులు ఏపీకి వచ్చి పోర్టులు, పరిశ్రమలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించాలని ఆహ్వానించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతోందని లోకేష్ తెలిపారు. వేగవంతమైన నిర్ణయాలు, సమన్వయం, పెట్టుబడి ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో వాస్తవ ప్రాజెక్టులుగా మార్చడంపై దృష్టి పెట్టామని చెప్పారు. సాంకేతికత, పెట్టుబడులు, వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కేవలం సమావేశాలు, ఒప్పందాలకే భాగస్వామ్యాలను పరిమితం చేయకుండా.. కలిసి గొప్ప ప్రాజెక్టులను నిర్మించాలని పిలుపునిచ్చారు.
భారత్, ఆసియాన్ దేశాలకు విశాఖ ముఖద్వారం కావాలి
బంగాళాఖాతం శతాబ్దాలుగా భారత్, ఆగ్నేయాసియా దేశాలను అనుసంధానిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. గతంలో సముద్ర మార్గాలు నాగరికతలను కలిపితే.. ఇప్పుడు అవే మార్గాలు వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు వేదికలుగా మారనున్నాయని చెప్పారు. విశాఖపట్నం కేవలం పోర్టు నగరంగా కాకుండా తూర్పు దేశాలకు భారతదేశ ముఖద్వారంగా ఎదుగుతోందని తెలిపారు. ఆసియాన్ దేశాలతో బలమైన, శాశ్వత భాగస్వామ్యాలను నిర్మించుకోవడానికి ఏపీ ఎదురుచూస్తోందన్నారు. బంగాళాఖాతాన్ని ఉమ్మడి సముద్రంగానే కాకుండా భారత్, ఆసియాన్ దేశాలకు ఉమ్మడి అవకాశాల వేదికగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామ్ మాధవ్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, మాజీ నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠీతో పాటు వివిధ దేశాల రాయబారులు, ఆసియాన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

