Gudivada Amarnath: అన్నివైపులా విశాఖ అభివృద్ధిపై చర్చ సాగుతున్న వేళ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ అప్పుడు విశాఖ గురించి చెప్పిన విషయాలనే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని తొలి సారిగా వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విశాఖ ప్రాధాన్యతను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. పరిశ్రమలు రావడం ఒక కొనసాగే ప్రక్రియ అని, దీన్నే ఇప్పుడు నూతనంగా చూపిస్తున్నారని విమర్శించారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పరిశ్రమలు విశాఖకు రావడం జగన్ కృషి ఉంది.. ఇన్ఫోసిస్ రాగానే సహజంగానే ఇతర ఐటీ సంస్థలు విశాఖ వైపు ఆకర్షితమయ్యాయని వివరించారు. టీసీఎస్ కూడా విశాఖకు రావడానికి జగన్ ప్రోత్సాహం కీలకం అని చెప్పారు.
Read Also: Gold and Silver: రికార్డులు సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. నెక్ట్స్ ఏంటి..?
రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎందుకు చౌకగా? ఇస్తున్నారు అంటూ.. ప్రభుత్వ భూవినియోగంపై అమర్నాథ్ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.. సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల విలువైన భూములు అతి తక్కువ ధరకు ఎందుకు కేటాయిస్తున్నారు అని ప్రశ్నించారు. మీకు నచ్చిన సంస్థలకు రూపాయి – అర్ధ రూపాయికే భూములు ఇస్తామంటే ఎలా? అంటూ మండిపడ్డారు. సత్వకు ఇచ్చిన భూమిలో రెసిడెన్షియల్ అపార్‌మెంట్లు, ప్లాట్లు నిర్మించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారు? అని నిలదీశారు.. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడమే కాదు, ప్రభుత్వ రాయితీలు కూడా ఇస్తారా? అని అడిగారు.
ఇక, గుజరాత్‌లో లూలూ సంస్థ ఎకరా భూమి కోట్లాది రూపాయలకు కొనుగోలు చేస్తుందని.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చాల తక్కువ ధరకు ఇస్తున్నారని ఆరోపించారు అమర్నాథ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పలేకపోతున్నారు అని విమర్శించారు. ప్రకటనల్లో లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే ప్రభుత్వ నిధులు వాడుతున్నారని ఆరోపించారు. పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో కూడా ప్రకటనల్లో పెట్టడం లేదని దుయ్యబట్టారు.. ఆపరేషన్ సింధూర్‌ను లోకేష్ మానిటర్ చేశారని చెప్పాల్సింది అంటూ సెటైర్లు వేశారు..
జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా అన్నప్పుడు విమర్శలు.. ఇప్పుడు చంద్రబాబుకు ప్రశంసలు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గుడివాడ.. వైఎస్ జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పినప్పుడు మీడియా, ప్రతిపక్షాలు నెగెటివ్ ప్రచారం చేశాయని.. అదే విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు చెబితే మీడియా ప్రశంసిస్తోందని దుయ్యబట్టారు.. మరోవైపు.. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ ఎక్కడికక్కడ మోడీ, పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టేవారని.. కానీ, నేడు ప్రకటనల్లో ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు చుక్కలా మారాయి అంటూ విమర్శించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్..
