Union Minister Srinivas Varma: సినిమా గ్లామర్‌తో మాత్రమే రాజకీయాల్లో విజయం సాధించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా గ్లామర్‌ను మాత్రమే ఆధారంగా చేసుకుని రాజకీయాల్లో రాణించిన ఉదాహరణలు లేవని స్పష్టం చేశారు. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బలమైన ప్రజా నాయకుడిగా శ్రీనివాస్ వర్మ అభివర్ణించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యల కోసం పోరాడే నాయకత్వం ఆయనదని ప్రశంసించారు. కూటమిగా కలిసిపోటీ చేయడం వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధ్యమైందని తెలిపారు.
Read Also: Swayambhu : నిఖిల్ భారీ చిత్రం ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇక, దేశంలో సినీ స్టార్లను మించిన స్టార్ ప్రధాని నరేంద్ర మోడీ అని శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వంలోనే బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పొత్తుల విషయంలో అగ్రనాయకత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఉన్న ఆర్థిక భారం తగ్గించేందుకే CISF బలగాల ఉపసంహరణ జరిగిందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 4న ఉక్కు శాఖ కార్యదర్శి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించనున్నారని, అక్కడి పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ..
