NTV Telugu Site icon

Visakha Garjana: నేడు విశాఖ గర్జన.. మారుమ్రోగనున్న మూడు రాజధానుల నినాదం

Visakha Garjana Today

Visakha Garjana Today

Visakha Garjana In Vizag Today: వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటోన్న జేఏసీ.. శనివారం విశాఖ గర్జన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా పాల్గొననున్నారు. ఎల్‌ఐసీ జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి బీచ్ రోడ్ వరకు.. సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో మూడు రాజధానుల నినాదం మారుమ్రోమగనుంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదాన్ని సైతం చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. జేఏసీ చేపడుతోన్న ఈ ర్యాలీకి వైసీపీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే!

రాజకీయాలకు అతీతంగా.. శాంతియుతంగా జరిగే ర్యాలీ ద్వారా ఉత్తరాంద్ర ఆకాంక్షలను దిక్కులు పిక్కటిల్లేలా చెప్తామని జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనాన్ని వివరిస్తూ.. సాంస్కృతిక ప్రదర్శనల్ని సైతం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు, జాతీయ పతాకాలతో 50 మంది స్కెటర్లు ఈ ర్యాలీని లీడ్ చేయనున్నారు. ఈ ర్యాలీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల ముఖ్య నాయకులు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి పలువురు మంత్రులు చేరుకున్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం బీచ్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో జేఏసీ నాయకులతో పాటు ప్రభుత్వం నుంచి కొద్దిమందికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది.

మరోవైపు.. ఈ విశాఖ గర్జన కోసం వెయ్యి మందికి పైగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ జరగడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ర్యాలీ కోసం వందలాది వాహనాల్లో తరలివస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక పార్కింగ్ ఏరియాల్ని ఏర్పాటు చేశారు. విశాఖ రీజియన్ పరిధిలో 250 ఆర్టీసీ బస్సులు అద్దెకు వెళ్లాయి.