Ganja Batch: విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. ముఖ్యంగా చిట్టి నగర్, వాగు సెంటర్, పంజా సెంటర్, శ్రీనివాస మహల్, సాయిరాం థియేటర్, రైల్వే యార్డ్ లాంటి ప్రాంతాల్లో ఈ బ్యాచ్ బహిరంగంగానే గంజాయి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరుగుతున్న ఈ ఘటనలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇక్కడ గంజాయి ఎందుకు సేవిస్తున్నారని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు. బండ్ల సీటు కవర్లు కత్తిరించడం, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం లాంటివి చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
Read Also: Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారు!
ఇక, విజయవాడలోని ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, స్టూడెంట్స్, మహిళలు, అమ్మాయిలు ఈ గంజాయి బ్యాచ్ చేసే ఆగడాలను తట్టుకోలేకపోతున్నామని తెలిపారు. రాత్రి సమయంలో వీరు గుంపులుగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, కొత్తపేట పోలీసులు నైట్ రౌండ్స్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో విఫలం అయిందని పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు పోలీసులు స్పందించడం లేదంటున్నారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
