Vijayawada: పేదలకు పట్టాభిషేకంలో భాగంగా కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 30వ తేదీన విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు అందించనున్నారు. విశాఖ తరహాలోనే విజయవాడలోనూ భారీ ఎత్తున 24,057 కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. విజయవాడలో దశాబ్దాల క్రితం ఇచ్చిన ఎన్టీఆర్ పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పించి, లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలు అందించనున్నారు. తద్వారా ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల విశాఖలో రూ.8,874 కోట్ల విలువైన భూమిపై 28,445 కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు క్రమబద్ధీకరణ పట్టాలు అందించారు. ఇప్పుడు విజయవాడలో రూ.9,800 కోట్ల విలువైన భూమిపై 24,057 కుటుంబాలకు పట్టాలు ఇవ్వనున్నారు.
ఈ పట్టాల ద్వారా ఒక్కో కుటుంబానికి సుమారు రూ.40 నుంచి రూ.45 లక్షల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం నియోజకవర్గం కలిపి మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లోని 15 మండలాల పరిధిలో లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులతో పట్టాలు అందించనున్నారు. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల పరిధిలోని కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో కొండలపై ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.
కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఇళ్లకు శాశ్వత భద్రత, భవిష్యత్తుకు భరోసా కల్పించేలా క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలోనూ ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల దశాబ్దాల కలను నిజం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 617 ఎకరాల్లోని 29.86 లక్షల చదరపు గజాల స్థలంపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పించనున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వనున్న భూముల మార్కెట్ విలువ సుమారు రూ.24,297 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ వర్గాలకు చెందిన 12,093 కుటుంబాలు, ఓసీలకు చెందిన 6,130 కుటుంబాలు, ఎస్సీ వర్గానికి చెందిన 4,546 కుటుంబాలు, ముస్లిం బీసీలకు చెందిన 955 కుటుంబాలు, ఎస్టీ వర్గానికి చెందిన 333 కుటుంబాలు ఈ పట్టాల ద్వారా లబ్ధి పొందనున్నాయి.
నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు
* విజయవాడ తూర్పు: 7,990
* విజయవాడ పశ్చిమ: 7,465
* విజయవాడ సెంట్రల్: 5,815
* గన్నవరం: 602
* జగ్గయ్యపేట: 1,135
* మైలవరం: 981
* నందిగామ: 54
* తిరువూరు: 15
ఈ క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీతో దశాబ్దాలుగా ఇళ్లపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. విజయవాడలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పేద కుటుంబాలకు శాశ్వత భద్రత కల్పించే కీలక ఘట్టంగా ప్రభుత్వం పేర్కొంటోంది. కాగా, ఇప్పటికే విశాఖపట్నం వేదికగా పెద్ద సంఖ్యలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విషయం విదితమే..

