Vijayawada: విజయవాడ ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయం సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ కు చెందిన ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పార్కింగ్ విషయంలో ప్రశ్నించిన భక్తులపై విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పార్కింగ్ చార్జీలు, వసతులపై ప్రశ్నించిన భక్తులపై కాంట్రాక్టర్ సిబ్బంది, ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా శారీరకంగా దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, భక్తులతో పార్కింగ్ విషయంలో తరచూ వివాదాలకు దిగడం, గతంలోనూ పలువురిపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ.. పార్కింగ్ సిబ్బందిపై ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. పార్కింగ్ కాంట్రాక్టర్ దోపిడీకి ఆలయ అధికారులు అండగా నిలుస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. కాగా, దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ సిబ్బంది చర్యలతో ఆలయ పవిత్రతకు భంగం కలుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ కాంట్రాక్టర్, ఏజెల్ సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
