Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన ఆరోపణలు

Saikrishna Case Cbi

Saikrishna Case Cbi

Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, గతంలో నమోదైన క్రైమ్ నంబర్‌ 107/2026 ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా తీసుకుని 2026 జూన్‌ 19న కేసు నమోదు చేసినట్లు పేర్కొంది సీబీఐ..

కస్టడీలో అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, లాకప్‌ డెత్‌తో పాటు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అయితే, ఇవి ఫిర్యాదులో వచ్చిన ఆరోపణలేనని, వాటిపై దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది. అయితే, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణ బాధ్యతలను సీబీఐ ఏఎస్పీ నరేంద్ర దేవ్ చేపట్టినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 127(6), 103(1), 238 కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగడం, పోలీసు అధికారితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాయి కృష్ణ మృతి వెనుక ఉన్న పరిస్థితులు, కస్టడీలో ఏం జరిగింది, మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల్లో వాస్తవాలేమిటన్న అంశాలపై సీబీఐ దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.