Navratri Day 4: విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.. నాల్గో రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.. శక్తి సాధనకు ప్రతీక అయిన కాత్యాయని దేవి పూజిస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దుర్గాదేవి నవ దుర్గలుగా అవతరించిందని విశ్వాసం. ఈ నవ దుర్గలలో ఆరవ అవతారమే కాత్యాయని అవతారంగా చెబుతారు.. వామన పురాణం ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షికి సంతానం కలగకపోగా.. దుర్గా దేవి భక్తుడైన ఆయన.. సంతానం కోసం ఘోర తపస్సు చేసి దుర్గమ్మను ప్రసన్నం చేసుకుని అమ్మవారే తనకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్నాడట.. దీంతో అమ్మవారు అంగీకరించిందని పురాణాలు చెబుతున్నాయి.. కాత్యాయన మహర్షి కిరణాల రూపంలోని త్రిమూర్తుల శక్తులకు తన తపః ప్రభావంతో ఒక స్త్రీ రూపాన్ని ఇస్తాడు. ఈ విధంగా కాత్యాయన మహర్షి వరం కూడా సార్ధకమవుతుంది. త్రిమూర్తుల శక్తుల అంశతో దుర్గాదేవి కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మిస్తుంది. కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి ఆమె కాత్యాయనిగా పిలువబడిందని చెబుతారు..
Read Also: AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం..
ఇక, కాత్యాయని ముల్లోకాలను సమ్మోహనపరిచే రూప లావణ్యాలతో, రాక్షస సంహారం చేయగలిగే యుద్ధ పటిమతో, శత్రు భయంకరిగా పేరొందింది. చతుర్భుజాలతో వెలసిన కాత్యాయని దేవి తన నాలుగు చేతులలో ఖడ్గం, పద్మం, వరద హస్తం, అభయహస్తం ధరించి ఉంటారు.. ఆమెను దర్శించుకుంటే.. ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, అనేక జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందనేది పండితుల మాట.. నవరాత్రుల్లో పెళ్లికాని అమ్మాయిలు తమకు నచ్చిన భర్తను పొందడం కోసం కాత్యాయని మాతను పూజిస్తారు. కాగా, ఇంద్రకీలాద్రి పై దసరా నవరాత్రి మహోత్సవాలలో మూడవ రోజు వైభవంగా సాగాయి.. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది కావడంతో.. ఉత్సవాలు ప్రారంభమైన మూడవ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది అనేది భక్తుల విశ్వాసం..
అన్నపూర్ణ దేవి అలంకరణలో దుర్గమును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి రోజా, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, సాయంత్రం నాలుగు గంటలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మంత్రి పార్థసారథి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఈవో, న్యాయమూర్తులు, పలువురు ప్రముఖులు ,వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ.కేశినేని శివనాద్ చిన్ని కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దుర్గమను దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదము పొందారు. ఇంద్రకీలాద్రి ఆలయానికి ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ సాయంత్రం 4:10 నిమిషాలకి చేరుకున్నారు. ఉపరాష్ట్రపతికి ఎండోమెంట్ కమిషనర్ సిహెచ్ రామచంద్ర మోహన్, మినిస్టర్ పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్, బోర్ర గాంధీ, దుర్గగుడి ఈవో శీనా నాయక స్వాగతం పలికారు.ఉత్సవ కమిటీ సభ్యులను,భక్తులను ఉపరాష్ట్రపతి పలకరించారు. కుటుంబ సమేతంగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం వైదిక కమిటీ సభ్యులు అందించారు. అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆలయ ఈవో సీనా నాయక్ అందించారు.
