Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి. దీనికి డైరెక్షన్ అంతా జనార్దన్ రావ్.. ఏ2 నిందితుడు కట్టా రాజు ఇందులో కీ రోల్ పోషించాడు. తయారీ దగ్గర నుంచి అమ్మకాలు, కలెక్షన్లు, వాటాల పంపిణీ అంతా అతనే చూసుకునేవాడు. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన జయచంద్రారెడ్డికి మద్యం వాటా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఇంట్లో పనిచేసే అన్బురాసు.. అలియాస్ బాబు తీసుకునేవాడు. ఎక్సైజ్ అధికారుల రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. కట్టా రాజు నుంచి డైరీ, ల్యాప్ టాప్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కట్టా రాజుకు జనార్దనరావు 1990 నుంచి తెలుసు. జనార్దనరావు దుకాణాల్లో రాజు లెక్కలు చూసుకునేవాడు. ములకలచెరువులోని రాక్‌స్టార్ వైన్స్, చెండ్రాయునిపల్లెలో ఆంధ్రా వైన్స్‌లో పనిచేస్తూ వాటి బిజినెస్ వ్యవహారాలవీ చూసుకునేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జనార్దనరావు అతడిని పిలిచి మాట్లాడాడు. జయచంద్రారెడ్డి తనకు చాలా సన్నిహితుడని, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి, బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్‌కు చెందిన నెకిరికంటి రవి, కట్టా సురేంద్ర నాయుడు కలిసి పెద్దఎత్తున లిక్కర్ తయారు చేసి అమ్మాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
Read Also: Coldref Cough Syrup Case: 20 మంది చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్..
జనార్దన్‌రావు- జయచంద్రారెడ్డి ఇద్దరూ స్నేహితులు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పోటీ చేసిన సమయంలో ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ జనార్దనరావే చూశారు. అలా నకిలీ మద్యం తయారీకి అవసరమైన సామగ్రి, యంత్రాలను సమకూర్చుకున్న తరువాత ఈ ఏడాది జూన్ నుంచి తయారుచేయడం ప్రారంభించారు. అమ్మకాలు, కలెక్షన్లు, ఎవరికి, ఎక్కడ, ఎంత ముట్టజెప్పాలో, ఎలా అందజేయాలో కట్టా రాజు చూసుకునేవాడు. ఆ వివరాలన్నింటినీ జనార్దనరావు సూచనల మేరకు డైరీ, ల్యాప్‌టాప్‌లో నమోదు చేశాడు. జయచంద్రారెడ్డి వాటా సొమ్ములను ఆయన ఇంట్లో పనిచేసే అన్బురాసు తీసుకుని కట్టా రాజు దగ్గరున్న డైరీలో సంతకం చేసేవాడు. జనార్దనరావుతో పాటు బాలాజీ, రవి, జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు, టి.రాజేశ్‌లతో పాటు మరికొంత మందికి ఈ నకిలీ మద్యంతో ప్రమేయం ఉందని కట్టా రాజు వాంగ్మూలం ఇచ్చాడు. రాక్‌స్టార్ వైన్స్‌కు సంబంధించిన అన్ని ఖాతాలను జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే అన్బురాసు చూసుకునేవాడని చెప్పాడు. కట్టా సురేంద్ర నాయుడు కమ్మవారిపల్లెలోని తన ఇంటిలో నకిలీ మద్యాన్ని నిల్వచేసి చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేసేవాడని తెలిపాడు.
అష్రఫ్ అనే వ్యక్తి స్కార్పియో వాహనంలో ఆయా గ్రామాల్లో మద్యం సరఫరా చేసేవాడని కట్టా రాజు వాంగ్మూలంలో చెప్పాడు. ఈ కేసులో ఏ12- తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి.. జనార్దనరావుతో ఆయనకు చదువుకునే సమయం నుంచే పరిచయం ఉంది. స్నేహం, గతంలో చేసిన ఆర్థిక సాయం కారణంగా ఆ షెడ్డును లీజుకు తీసుకుంటున్నట్లు శ్రీనివాసరావు అగ్రిమెంటు చేసుకున్నాడు. అతనికి ఖాళీ మద్యం సీసాలు తెప్పించే బాధ్యత అప్పగించారు. ఈ కేసులో కట్టా రాజు, కొడాలి శ్రీనివాసరావును పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడు జనార్దనరావు లొంగుబాటుకు సిద్ధమయ్యారు. దక్షిణాఫ్రికాలో ఉన్న అతను మదనపల్లె కోర్టులో ఇవాళ లొంగిపోతాడని సమాచారం. అతను వాంగ్మూలం ఇస్తే ఇంకొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది.
