Site icon NTV Telugu

Baby Trafficking Racket: బెజవాడలో పసిబిడ్డల విక్రయాల ముఠా అరెస్ట్

Baby Trafficking Racket

Baby Trafficking Racket

Baby Trafficking Racket: బెజవాడలో పసిబిడ్డల విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నెలల వయసున్న శిశువులను తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను గుర్తించి పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి ఐదుగురు పసిబిడ్డలను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఒక్కో శిశువును రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. గతంలో అరెస్ట్ అయిన బండి సరోజ ముఠానే ఈ అక్రమ శిశు విక్రయాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం అరెస్ట్ అయిన అనంతరం బయటకు వచ్చిన సరోజ ముఠా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు.

Read Also: Trump-White House: జో బైడెన్ చెత్త అధ్యక్షుడు.. వైట్‌హౌస్‌లో అధ్యక్షుల చిత్రపటాల కింద రాతలు

ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. నిందితులు విజయవాడ, పాయకాపురం, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు పసిబిడ్డలను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, రక్షణ చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, ఈ అక్రమ శిశు విక్రయాల వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు.

Exit mobile version