AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్లో వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరుగుతున్నాయి.. ఇక, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, విలీనానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు సర్క్యులర్ నంబర్ 1953/SEC-B2/2026 విడుదల చేసింది. గ్రామ పంచాయతీలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమై, కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను విలీనం చేసేందుకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు అనుమతి ఇచ్చింది.
ఖర్చులు తగ్గించేందుకు పోలింగ్ కేంద్రాల విలీనం
ఎన్నికల నిర్వహణలో సిబ్బంది నియామకం, రవాణా, ఇతర ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే పోలింగ్ కేంద్రాల విలీనం తర్వాత ఒకే కేంద్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 650కి మించకూడదని స్పష్టం చేసింది. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలను విలీనం చేసిన తర్వాత పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే పోలింగ్ సిబ్బందిని నియమించాలి. కేవలం ఒకే ప్రాంగణంలో లేదా ఒకే భవనంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను మాత్రమే విలీనం చేయాలని స్పష్టం చేసింది.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు తప్పనిసరి
పోలింగ్ కేంద్రాల విలీనం జరిగిన ప్రాంతాల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా తప్పనిసరిగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే పోలింగ్ కేంద్రాల విలీనం గురించి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ పోలింగ్ కేంద్రాల విలీనానికి సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్లో పేర్కొంది.

