AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు మండలాల్లో ఇవాళ జరగాల్సిన పోలింగ్‌ను రేపటికి వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం జిల్లా పరిధిలోని పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలాల్లో రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో అనివార్య కారణాలతో ఇవాళ జరగాల్సిన ఎన్నికలను రేపటికి మారుస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక, వాయిదా పడిన ఈ ఐదు మండలాల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో పాటే ఎల్లుండి నిర్వహించనున్నారు. అయితే ఈ ఐదు మండలాల్లో ఏదైనా మండలంలో రీపోలింగ్ అవసరమైతే, ఆ మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేస్తారు. అనంతరం రీపోలింగ్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త తేదీని ఖరారు చేయనుంది.
కోసిగిలోని ZPTC పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్
మరోవైపు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని ఆర్లబండ గ్రామంలో ఉన్న ZPTC పోలింగ్ స్టేషన్ నంబర్ 2లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందనే ఫిర్యాదులు రావడంతో ఎస్ఈసీ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రంలో తిరిగి పోలింగ్ జరగనుంది.
శ్రీకాకుళం జిల్లాలోనూ రీపోలింగ్
ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం పోలింగ్ కేంద్రం నంబర్ 2లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఐదు మండలాల్లో పోలింగ్ వాయిదా, కోసిగి మండలంలోని ఆర్లబండలో రీపోలింగ్, శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నంలో మరో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

