South Central Railway: దేశంలో అనేక ప్రాంతాల్లో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పట్టాలెక్కనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారిక సమాచారం అందింది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా వందేభారత్ రైలును కేటాయిస్తూ స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వయా కాజీపేట మీదుగా ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.
Read Also: Marriage Fraud: నిత్యపెళ్ళికూతురు..ఐదో పెళ్లికి రెడీ అవుతూ అడ్డంగా బుక్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైలు ఆరోది కానుంది. వందేభారత్ రైలు గరిష్టంగా 180 కి.మీ వేగంతో వెళ్తుంది. రెండు నిమిషాల్లోనే 160 కి.మీ. వేగం అందుకుంటుంది. ఈ రైలులో సీట్లు మాత్రమే ఉంటాయి. బెర్తులు ఉండవు. బెర్తులు అందుబాటులోకి వచ్చాక ఈ రైలును విశాఖ వరకు పొడిగించి నడిపించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మద్య కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ఠ వేగ సామర్ధ్యం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. వందేభారత్ రైలు కోసం ట్రాక్ సామర్థ్యాన్ని 180 కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుంది. త్వరలోనే ట్రాక్ అప్‌గ్రేడ్, సిగ్నలింగ్, ఇతర పనులు చేపట్టే అవకాశం ఉంది.