Site icon NTV Telugu

Vijayasai Reddy: జగన్, మోడీ భేటీపై.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy

Vijayasai Reddy

Vaijayasai Reddy Tweet On CM Jagan PM Modi Meeting: తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే! ఈ భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ మాధ్యమంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా.. ప్రధాని మోడీతో జగన్ భేటీ సానుకూల రీతిలో ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు. ఈ భేటీలో భాగంగా ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల్ని మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లారని వెల్లడించారు. ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా కేంద్రం సహకారం అందించాలని సీఎం కోరినట్టు తెలిపారు.

కాగా.. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, మెడికల్ కాలేజీలు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీలతో పాటు ఇతర అంశాలపై సీఎం జగన్ వినతి పత్రం అందించారు. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేకహోదాతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని జగన్ చెప్పారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదని మోడీకి జగన్ తెలిపారు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు చేసిందని, కేంద్ర ఆర్థిక వ్యవస్థ ఈ ప్రభుత్వంలో వాటిని సర్దుబాటు చేస్తోందని వివరించారు. అటు.. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.2,937 కోట్లు ఖర్చు చేసిందని, దీనికి సంబంధించిన చెల్లింపులు రెండేళ్లుగా జరగడం లేదని సీఎం వెల్లడించారు.

అలాగే.. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిల రావాలని, వాటిని తక్షణమే ఇప్పించాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరిందని, రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. జనాభా రీత్యా మిగిలిన 12 జిల్లాలకు కూడా మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో రాజకీయ పరమైన అంశాలపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు.. సీఎం జగన్ ఈరోజు రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు.

Exit mobile version