NTV Telugu Site icon

Twins Hungama in Vizag: కవలల హంగామా.. అల్లరి చూడతరమా

కవలలు కొంతమంది కనిపిస్తే వారిని గుర్తుపట్టలేం. కానీ కళ్ల ముందు ఇరవై ముప్పై మంది కనిపిస్తే వారిని గుర్తు పట్టడం ఇంకా కష్టం. రోజూ చూసేవారిని సైతం అంత ఈజీగా గుర్తుపట్టలేం. అలాంటిది ఒకే ఫ్రేమ్ లో 30 కు పైగా కవల జంటలు… ఒకే చోట చేరితే ఆ కన్ఫ్యూజన్ మాములుగా ఉండదు. చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి అద్భుత దృశ్యమే విశాఖలో కనువిందు చేసింది. ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్విన్స్ ఒకే దగ్గరకు చేరి సందడి చేసారు..ఈ బొమ్మనా బ్రదర్స్., చందన సిస్టర్స్ చేసిన ఆ హంగామా అంతా ఇంతా కాదు.

వారంతా దేవుడు చేసిన మనుషులు. మనుషులను పోలిన మనుషులు ఈ సృష్టిలో ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు. ఇది కనిపెట్టడం చాలా అరుదు.. అలాగే ఏదైనా ఊరిలోనో, ఇంటిలోనో కవలలు ఉంటే వారిని చూసి ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా ఎంతో సంబరపడిపోతుంటాం. ఎందుకంటే ఒకే పోలికలతో అచ్చుగుద్దినట్టు జన్మించడం ఓ విధంగా దేవుడిచ్చిన వరమనే చెప్పుకోవాలి. అలాంటి వారికోసం ఫిభ్రవరి 22 న ప్రపంచ కవలల దినోత్సవంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణాలో ఉన్న కవలలు ఒకే వేదికపై కలవాలనుకున్నారు. అయితే దానికోసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్‌ లక్ష్మణ్ అనే ట్విన్ బ్రదర్స్ ముందుకొచ్చారు. వారు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి రెండు రాష్ట్రాలలో ఉన్న కవలలను గుర్తించి వారిని కలుపుకున్నారు.

ఆటపాటలతో, డ్యాన్స్ లతో, వెరైటీ వెరైటీ గేమ్స్ లను కండక్ట్ చేసి ఎంజాయ్ చేసారు. తమలాగే ఈ ప్రపంచంలో ఇంతమంది కవలలు ఉన్నారా అని తెగ సంబరపడిపోయారు. విద్యార్ధులు, చిన్నారులు, గృహిణులు, ఉద్యోగులు వీరంతా ఈ కవలలులో ఉన్నారు. ఈ రోజుని ఓ పండగలా జరుపుకున్నామని తెలిపారు.. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఎంజాయ్ చేశారు. అంతేకాదు కవలలుగా తాము ఎదుర్కొంటున్న ఘటనలు, సరదా సన్నివేశాల వంటివి షేర్ చేసుకున్నారు.ఈ కవలల్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదంటున్నారు సందర్శకులు, మిత్రులు.