NTV Telugu Site icon

TTD: ప్లాస్టిక్ పై యుద్ధం.. అలిపిరిలో ముమ్మర తనిఖీలు

Ttd Plastic

Ttd Plastic

తిరుమల కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ వస్తువులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తులు తిరుమల కొండపైకి ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్‌ తీసుకుని వెళ్లకుండా కట్టుదిట్టమయిన తనిఖీలు నిర్వహిస్తోంది టీటీడీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు చేపట్టారు. కాలినడకన, వాహనాల్లో వస్తున్న భక్తులను అలిపిరి వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్‌ సీసాలు, కవర్లను స్వాధీనం చేసుకొని పంపించారు. దీంతో అక్కడ డస్ట్ బిన్ అంతా ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్ తో నిండిపోయింది.

అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దుకాణ దారులకు సూచించారు. పంచలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు గానీ, పేపర్ కవర్లు ఉపయోగించాలి. తిరుమల వెళ్లే భక్తులు పలు ఈ సూచనలు పాటించాల్సి వుంటుంది. తిరుమల తరహాలోనే ఏపీలో ఉన్న దేవాలయాల్లో ఇక నుంచి ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్‌ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి ఇకపై అనుమతించబోరు. ఆలయానికి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్నగా ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై నిషేధం అమలులో వుంటుంది.

మరోవైపు భక్తుల నుంచి దోపీడికి పాల్పడే వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. తిరుమల ఆస్థానమండపంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అధికారులు సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువులు అమ్మవద్దని సూచించారు. హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా డస్ట్ బిన్లలో ఉంచాలని, తద్వారా సేకరణకు అనువుగా ఉంటుందని అధికారులు అదేశాలు జారీ చేశారు. దుకాణాల్లో అనుమతించిన వస్తువులనే విక్రయించాలి. ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు షాపులను మాస్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులు కోరారు.

Tirumala: తిరుమలకు వెళుతున్నారా.. ఒక్క క్షణం ఆగండి