మూడేళ్ల చిన్నారి వారం రోజులుగా తరచూ దగ్గుతో పాటు ఆయాసం పెరుగుతుండడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగి చూపించారు. అయినా పరిస్థితి రోజు రోజుకీ స్థితి విషమించడంతో చివరకు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలుడికి ఊపిరితిత్తుల స్కాన్ చేయగా కనిపించిన దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పూర్తి వివరాల్లోకి కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంత్‌కు మూడేళ్ల కుమారుడు పాలెం మహి ఉన్నాడు. వారం రోజుల క్రితం ఆడుకుంటూ చిన్నారి పొరపాటున ప్లాస్టిక్ బాటిల్ మూతను మింగేశాడు. వెంటనే అతనికి తీవ్రమైన దగ్గు, ఆయాసం మొదలైంది. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు రావడంతో భయపడ్డ తల్లిదండ్రులు రుయా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సీటీ స్కాన్‌లో మహి ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ మూత ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే బ్రాంకోస్కోపీ శస్త్రచికిత్స అవసరం ఉందని తల్లిదండ్రులకు తెలిపారు. డిసెంబర్ 1న డాక్టర్లు అత్యవసర శస్త్రచికిత్స చేసి మూతను బయటకు తీసారు.దీంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే బాలుడి పూర్తిగా కోలుకున్న తర్వాత డిసెంబర్ 4న డిశ్చార్జ్ చేశారు. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. రుయా ఆసుపత్రి వైద్యులు వేగంగా స్పందించి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి చిన్నారి ప్రాణం కాపాడడంతో.. వారిని అందరూ అభినందిస్తున్నారు.
