Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి

Sri City Boiler Blast

Sri City Boiler Blast

Sri City Boiler Blast: తిరుపతి: శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సత్యవేడు మండలం శ్రీ సిటీ పరిధిలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.. నైట్‌ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు పేలుడు ధాటికి చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బాయిలర్‌ పేలుడుతో పరిశ్రమలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పరిశ్రమ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడులో మరికొందరు కార్మికులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన పరిశ్రమలో అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఏమిటన్న దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాయిలర్‌ పేలుడుకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీసిటీలోని ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదమని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు నారా లోకేష్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.