TTD: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఇక స్వామివారి ఆలయంలో పరిమిత రోజులు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితి దృష్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో.. వైకుంఠ ఏకాదశి నిర్వహణ టీటీడీకి ప్రతి సంవత్సరం కష్టతరంగా మారుతూ వస్తుంది. దీనితో ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు ఇబ్బందులు కలగని విధంగా ముందస్తూ ఏర్పాట్లు చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. మొదటి మూడు రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలతో పాటు జనవరి ఒకటి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొదటి మూడు రోజులుకు సంబంధించిన దర్శన టోకెన్లను ముందస్తుగానే కేటాయించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ.
Read Also: Hyderabad Metro : మెట్రోలో మహిళల భద్రతకు నూతన అడుగు
దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే మొదటి మూడు రోజులు దర్శనానికి అనుమతించబోతున్నారు. దర్శన టోకెన్లకు సంబంధించి కూడా గతంలో లాగా ఆఫ్ లైన్ విధానాన్ని రద్దుచేసి ఆన్‌లైన్ విధానంలో కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తుంది టీటీడీ.. నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు వరకు భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ఈ డిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా టీటీడీ వెబ్‌సైట్, యాప్, వాట్సాప్ ల ద్వారా భక్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేయగా.. పెద్ద సంఖ్యలో భక్తులు ఆన్‌లైన్‌లో మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఐదు రోజులలో వ్యవధిలో 9 లక్షల 55 వేల రిజిస్ట్రేషన్లు జరుగగా.. వైకుంఠ ద్వార దర్శనం కోసం 24 లక్షల మంది భక్తులు రిజిస్టర్ అయ్యారు. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా 37 శాతం.. యాప్ ద్వారా 57 శాతం.. వాట్సాప్ ద్వారా ఆరు శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరోవైపు మూడు రోజులకు సంబంధించి లక్షా 88 వేల దర్శన టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. మొదటి రోజు 62,000 మంది భక్తులకు.. రెండవ రోజు 69 వేల మంది భక్తులకు.. మూడవరోజు 57,000 మంది భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
ఉదయం ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలను దర్శనానికి అనుమతించి.. అటు తరువాత పూర్తిస్థాయిలో దర్శన టోకెన్లు కలిగిన భక్తులని స్వామివారి ఆలయంలోకి అనుమతించునున్నారు. దీనితో భక్తులకు వేగవంతంగా వైకుంఠ ద్వార దర్శనం లభించడంతోపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం లభించబోతుంది. మిగిలిన ఏడు రోజులకు సంబంధించి గతంలో ఉన్న విధానాన్ని టీటీడీ కొనసాగిస్తుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధించి ఆన్‌లైన్‌లో ప్రతిరోజు 15000 చొప్పున ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను.. 1000 చొప్పన శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను.. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఇక సర్వదర్శనం భక్తులు ముందు వచ్చిన వారిని ముందు ప్రాతిపాదికన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. ఇలా పది రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.
