Tirupati: తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించే ఘటన చోటుచేసుకుంది. స్వామివారి ఏకాంత సేవ ముగిసిన అనంతరం, విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మద్యం మత్తులో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఆలయం వెనుక భాగం గోడ దూకి లోపలికి ప్రవేశించిన అతడు, భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే మహా ద్వారం లోపలి గోపురం పైకి ఎక్కి, గోపురంపై ఉన్న పవిత్ర కలశాలను లాగేందుకు ప్రయత్నించాడు. అయితే, విజిలెన్స్, ఆలయ భద్రతా సిబ్బంది గమనించేలోపే పరిస్థితి అదుపు తప్పడంతో, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. గోపురం పైనున్న వ్యక్తిని కిందికి దించేందుకు ఐరన్ నిచ్చెనలు ఏర్పాటు చేసి, సుమారు 3 గంటలపాటు తీవ్రంగా శ్రమించారు.
Read Also: High Court: వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టులో జడ్పీటీసీలు పిటిషన్ దాఖలు
అయితే, గోపురం నుంచి దిగేందుకు అతడు విచిత్రమైన షరతు పెట్టాడు. “క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందికి దిగుతాను” అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. చివరకు ఫైర్ సిబ్బంది సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆలయం నుంచి కిందికి దించి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా, కూర్మవాడ, పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా పోలీసులు గుర్తించారు. విచారణలో మద్యం డిమాండ్ చేసిన విషయాన్ని అతడే అంగీకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం స్పందిస్తూ.. ఆలయంలోకి ఎలా ప్రవేశించాడు? భద్రతా వైఫల్యం ఎక్కడ జరిగింది? అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తాం అని తెలిపారు.
ఈ ఘటనతో ఆలయ భద్రత, విజిలెన్స్ వ్యవస్థ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల విశ్వాసానికి ప్రతీకైన ఆలయంలోకి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి సులభంగా ప్రవేశించడంపై టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
