NTV Telugu Site icon

Tirumala Anivara Asthanam: తిరుమలలో రేపు ఆణివార ఆస్థానం

Ttd Anivari

Ttd Anivari

తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయంలో రేపటి రోజున ఆణివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో 17వ తేదిన ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. రేపు సాయంత్రం పుష్పపల్లకిపై తిరుమల మాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. ఈ సారి కరోనా నిబంధనలు సడలించడంతో భక్తులు భారీగా హాజరవుతారని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు….అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరిరోజున జరిగే ఉత్సవం కావడంతో… ఈ వేడుకలకు ఆణివారఆస్థానం అనే పేరు వచ్చింది.చారిత్రక నేఫధ్యంలో పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుండి టీటీడి వార్షిక బడ్జెట్ ప్రారంభమయ్యేది.

టీటీడి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారినపటికీ అనాదికాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తు నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తుంది టీటీటీ. ఆణివారి ఆస్ధానం సందర్భంగా శ్రీరంగం దేవస్ధానం తరుపున స్వామి వారికి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్ద జియ్యర్ మఠంలో వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ జియ్యర్ స్వాములు,ఆలయ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో సర్వభూపాల వాహనంపై వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఇక ఆణివార ఆస్థానం రోజున సాధారణంగా స్వామి వారు సాయంకాలం సమయాన పుష్పపల్లకి పై మాఢ వీధుల్లో విహరిస్తూ, భక్తులకు దర్శనం ఇస్తారు. 5 నుంచి 7 టన్నుల పుష్పాలుతో అలంకరణ చేసిన పుష్పపల్లకి పై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు మాడ వీధులలో ఉరేగుతారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ.