Tirumala Laddu Sales:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తుంటారు.. తిరుమల వెళ్లేవారు.. వారితో పాటు బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలను తీసుకెళ్లారు.. అయితే, ఈ ఏడాది రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయించింది టీటీడీ.. తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు చరిత్రలో నిలిచిపోయే రికార్డును సృష్టించాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 సంవత్సరంలో మొత్తం 13 కోట్ల 52 లక్షల లడ్డూలు విక్రయించి సరికొత్త మైలురాయిని అందుకుంది. గత ఏడాది ఇదే విక్రయాలు 12 కోట్ల 15 లక్షలు మాత్రమే ఉండగా, ఈసారి ఏకంగా కోటి 37 లక్షల లడ్డూల విక్రయాలు అదనంగా నమోదయ్యాయి. ఇది శ్రీవారి పట్ల భక్తుల్లో పెరుగుతున్న విశ్వాసం, ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుదల, ప్రసాదానికి ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.
Read Also: Harmanpreet Kaur Record: మాజీ దిగ్గజం రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్!
కాగా, ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తుండగా, ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు, పర్వదినాలు, సెలవు రోజుల్లో ప్రసాద విక్రయాలు భారీగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 28, 2025న ఒక్కరోజే అత్యధికంగా 5 లక్షల 12 వేల లడ్డూలు విక్రయించినట్టు TTD వెల్లడించింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక సింగిల్ డే లడ్డూ విక్రయాలుగా నిలిచింది. TTD లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి, పవిత్రతపై భక్తులకు ఉన్న అపార విశ్వాసమే ఈ రికార్డు స్థాయి విక్రయాలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాన్ని అందించేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచినట్టు TTD అధికారులు తెలిపారు. రోజుకు సగటున 3.5 లక్షల నుండి 4 లక్షల వరకు లడ్డూలు తయారుచేసే సామర్థ్యం ఉండగా, పర్వదినాల్లో ఈ సంఖ్యను మరింత పెంచి భక్తుల అవసరాలను తీర్చారు.
మరోవైపు, లడ్డూ ప్రసాద విక్రయాలు పెరగడం ద్వారా దేవస్థానానికి ఆర్థికంగా కూడా మంచి ఆదాయం సమకూరినట్టు సమాచారం. అయితే, ఇది కేవలం ఆర్థిక లాభం కంటే.. భక్తి, విశ్వాసం, సంప్రదాయం, సనాతన సంస్కృతి పట్ల ప్రజల్లో ఉన్న గౌరవానికి ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ, పంపిణీ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని TTD యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త ఏడాదిలో ప్రసాద ఉత్పత్తి, పంపిణీలో మరిన్ని ఆధునిక సంస్కరణలు తీసుకొచ్చి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే, గతంలో శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టించగా.. ఆ తర్వాత టీటీడీ చేపట్టిన పటిష్ట చర్యలు కూడా లడ్డూ విక్రయాలు పెరగడానికి దోహదం చేశాయని కూడా చెబుతున్నారు..
