Site icon NTV Telugu

Tirumala: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

Ttd

Ttd

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించి టీటీడీ మరోసారి చరిత్ర సృష్టించింది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న వేళ, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సామర్థ్యానికి అదనంగా 15 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు. ఇది ఇటీవలి కాలంలో అత్యధిక దర్శన సంఖ్యగా నిలిచింది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదం, వైద్య, భద్రతా సేవలను సమన్వయం చేస్తూ టీటీడీ నిరంతరం పర్యవేక్షించింది.

Read Also: Delhi Firing: ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఓ వ్యాపారి నుంచి రూ. 3 కోట్లు డిమాండ్

ఇక, స్వామివారికి మొక్కుగా 27,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కళ్యాణకట్ట వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించారు. ఇదే సమయంలో భక్తుల కానుకలతో ఆలయ హుండి ఆదాయం రూ.4.1 కోట్లకు చేరుకుంది. ఇది ఒక్కరోజు లెక్కల్లో చెప్పుకోదగిన మొత్తంగా టీటీడీ పేర్కొంది. మరోవైపు, ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తూ, ఆధ్యాత్మిక అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చింది టీటీడీ. అయితే ఇవాళ పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన గరుడ వాహన సేవను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణ, భారీ భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Exit mobile version