Site icon NTV Telugu

Tirumala Garuda Seva: రేపు గరుడ వాహన సేవ.. ఇవాళ్టి నుంచే ఆంక్షలు..

Tirumala

Tirumala

Tirumala Garuda Seva: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి.. నాలుగో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చిన మలయ్యప్పస్వామి.. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే గరుడ వాహన సేవను రేపు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి నుంచే తిరుమలలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. ఇవాళ మధ్యహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రైవేట్‌ ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు సైతం అనుమతి నిలిపివేశారు.. అయితే.. రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు, నడకమార్గం తెరిచి ఉంటుందని టీటీడీ ప్రకటించింది..

Read Also: High Alert in Delhi: పండుగల వేళ ఉగ్రదాడులకు ఛాన్స్.. ఢిల్లీలో హైఅలర్ట్..!

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘటనమైన గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.. మూడున్నర లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న టీటీడీ.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది.. మాడ వీధులలో రెండు లక్షల మంది భక్తులు వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశామని.. అంతకు మించి విచ్చేసిన భక్తులకు క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తామన్నారు ఈవో శ్యామలరావు.. కాగా, విశేష‌మైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరించనున్నారు ఆ శ్రీనివాసుడు.. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులకు.. సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇక, పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్‌ కోడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు.. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్‌టీసీ బస్సుల్లో భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్‌ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

Exit mobile version