NTV Telugu Site icon

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

సీఎం జగన్‌ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ఓ ఎత్తు అయితే.. జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టకూడదంటూ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తుగా కనిపిస్తోంది. GOIR వెబ్‌ సైట్‌ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఈ ఆనవాయితీని జగన్‌ సర్కార్‌ పక్కకు పెట్టింది. ఈ విధానానికి స్వస్తి పలకాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు మెమో పంపింది. ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం జీవోలను పబ్లిక్‌ డొమైనులో పెట్టకూడదని డిసైడ్‌ అయినట్టు స్పష్టం చేసింది ఏపీ సర్కార్‌. ప్రభుత్వం ఇంత సడెన్‌గా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే అంశంపై వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలతో ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా APSDC విషయంలో ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆర్థికపరమైన విషయాల్లోనూ తీవ్ర విమర్శలకు గురైంది. అలాగే కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ జీవో విడుదల చేసిన వెంటనే దాన్ని బేస్‌ చేసుకుని వెంటనే కోర్టుకు వెళ్తోన్న సంఘటనలూ ఎక్కువ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ తలనొప్పులు లేకుండా ఉండాలంటే అసలు కీలక ఉత్తర్వులు పబ్లిక్‌ డొమైనులో పెట్టకుండా ఉంటే బెటరేమోననే ప్రతిపాదనకు మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారా..? అని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బ్లాంక్‌ జీవోల విషయంలో పెద్ద రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో.. జీవోలను పబ్లిక్‌ డొమైనులో పెట్టకూడదన్న నిర్ణయం ఇంకెంత రచ్చకు దారి తీస్తుందో చూడాలి..