Telangana Police Constable Shaik Subhan Died In Bejawada: ఏపీలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన వ్యవహారం సంచలనం రేపుతోంది. ఎందుకంటే.. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మృతుడి భార్య చేసిన ఫిర్యాదుకు, సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోన్న దృశ్యాలకు ఏమాత్రం పొంతన లేదు. అసలు ఏమవుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పోలీసులు.. లోతుగా విచారణ చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న షేక్ సుభాన్.. ఈనెల 7వ తేదీన ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు బెజవాడ వచ్చాడు. ఫంక్షన్ నుంచి తిరిగి వెళ్తుండగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈనెల 10వ తేదీన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో.. మద్యం మత్తులో రోడ్డుపై పడి, సుభాన్‌కు తీవ్ర గాయాలైనట్టు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కానీ, సుభాన్ భార్య మాత్రం అందుకు భిన్నంగా ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతోనే తన భర్త గాయపడి, మృత్యువాత పడ్డాడని చెప్తోంది.
అటు.. సీసీటీవీ ఫుటేజ్‌కి, సుభాన్ భార్య ఫిర్యాదుకి చాలా తేడా ఉండటంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తొలుత ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేయగా.. సుభాన్ భార్య ఫిర్యాదుతో హత్య కేసుగా మారుతూ కేసు నమోదు చేశారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ కేసులో ఎలాంటి రిపోర్ట్ తేలుతుందో చూడాలి.
