Site icon NTV Telugu

Breaking News: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

Tdp Leader Bojjala

Tdp Leader Bojjala

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

చిత్తూరు జిల్లా ఉరందూరులో 1949, ఏప్రిల్ 15న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మించారు. ఆయన తండ్రి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే గంగా సుబ్బరామిరెడ్డి వారసుడిగా 1989లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం తరఫున పోటీ చేసి 1989–1994, 1994–1999, 1999–2004, 2009–2014, 2014-2019 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రజలకు సేవ అందించారు. 1999-2004లో ఐటీ, ఆర్‌అండ్‌బీ మంత్రిగా, 2014లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పనిచేశారు.

అలిపిరి బాంబుపేలుడు ఘటనలో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. కాగా ఇటీవల మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో బొజ్జల నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అయితే బొజ్జల ఆకస్మికంగా మృతి చెందడంతో టీడీపీ నేతలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Exit mobile version