TDP Leader Shaik Abdul Aziz Comments On MLA Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నెల్లూరు రూరల్‌లోని ఒక లే ఔట్‌లో 70 కోట్ల కుంభకోణం జరిగిందని.. చుక్కల భూములు తొలగించిన ప్రతి చోటా శ్రీధర్ రెడ్డి భూములున్నాయని ఆరోపించారు. కొందరు అధికారులతో కలిసి శ్రీధర్ రెడ్డి ప్రజలను మోసం చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రూ. 70 కోట్ల కుంభకోణంలో జిల్లా కలెక్టర్‌కి కూడా ఐదు కోట్ల అక్రమ వాటా ఉందని విమర్శలు వస్తున్నాయని.
తనకు నిజంగా వాటా లేకపోతే.. లే అవుట్‌పై చర్యలు తీసుకుని, తన నిజాయితీని నిరూపించుకోవాలని కలెక్టర్‌ను అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. ఇలాంటి కుంభకోణాలు చేయడానికే.. చుక్కల భూములకు క్లియరెన్స్ ఇచ్చినట్లుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖకు చెందిన నాలుగున్నర ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకొని.. లేఔట్‌లో కలిపేశారన్నారు. కుంభకోణం గురించి వివరాలు ఇవ్వడం కోసం తానను రెండు రోజుల నుంచి కలెక్టర్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నానని, కానీ ఆయన అందుబాటులోకి రావడం లేదని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు.
