విశాఖపట్నం లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన “రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” ( వైజాగ్ స్టీల్) ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతుంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ నిర్ధారించారు. విశాఖపట్నంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు కర్మాగారం ఇది. భారతదేశంలో సముద్ర తీరాన ఉన్న అతి పెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారం దీని ప్రత్యేకత. దక్షిణాన, మరియు తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఈ ఉక్కు కర్మాగారానికి అనేక అదనపు విశేషణాలు, తద్వారా పలు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి, దేశీయ అవసరాలను తీర్చేందుకు తగ్గట్లుగా రైలు, రహదారులు సౌకర్యాలున్నాయు. దానితో పాటు, ఇప్పటికే ఆగ్నేసియా మార్కెట్ల తో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న “టాటా స్టీల్” కు ఆయా మార్కెట్ల కు మరింతగా చేరువయ్యేందుకు సముద్ర తీరంలో ఉన్న విశాఖ ఉక్కు ప్రయోజనకరం గా ఉంటుందన్నారు టి.వి. నరేంద్రన్. 22 వేల ఎకరాలలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం లోని 100 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలను అమ్మాలని గత జనవరి 27 వ తేదీన “ఆర్ధిక వ్యవహరాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గం” సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ఇక మొత్తం 6 ప్రభుత్వరంగ సంస్థల వాటాలున్న ఒడిస్సా లోని “నీలాంచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” ( NINL) ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఇప్పటికే (“ఎక్సప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్”) ఆసక్తి ని తెలియజేసిందని తెలిపారు టి.వి. నరేంద్రన్. “నీలాంచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” లో 4 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ల వాటాలతో పాటు, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన రెండు ప్రభుత్వరంగ సంస్థ ల వాటాలున్నాయు. 2020 సంవత్సరంలో జనవరిలో కేంద్ర ప్రభుత్వం NINL అమ్మకానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. NINL, విశాఖ ఉక్కు ను కొనుగోలు చేయాలని కోలకతా లో ఒక మిలియన్ టన్ను సామర్థ్యం గల “టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్” ఆసక్తి చూపుతుంది.
అయితే కొనుగోలు పై ఇప్పటికే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయు లో కసరత్తు చేశాం. కొనుగోలు ప్రక్రియ లో మేము పాల్గొంటున్నాం. ఇంకా కొంత సమయం ఉంది. సరైన సమయంలో దీనిపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. టాటా స్టీల్ సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్. ఆటో రంగం, ఉక్కు తీగల ఉత్పత్తిలో, “లాంగ్ ప్రొడక్ట్” రంగంలో భారత దేశంలో “టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్” కు ఓ ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే.
