వీరుడా వందనం అంటూ అమర వీరునికి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తామరలో తుది వీడ్కోలు పలికారు. జాతీయ జెండాతో ఐదు కిలోమీటర్ల బైక్ ర్యాలీ చేసి అంతిమ వీడ్కోలు పలికారు. గత నెల 24న ఝార్ఖండ్ లో దురదృష్టవశాత్తు హెచ్ ఎఫ్ ఎస్ ఎల్ గ్రైనైడ్ పేలి పాతపట్నం మండలం తామర గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను పడాల యోగేశ్వరరావు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 15 రాత్రి ఆయన రాంచీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. యోగేశ్వరరావు (లవ కుమార్) 2017 లో సీఆర్పిఎఫ్ లో చేరారు. తర్వాత కాలంలో నక్సలైట్ల అణిచివేతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోబ్రా 313 బ్యాచ్ లో చేరారు. సెలవుపై గత నెల 7వ తారీకున స్వగ్రామమైన తామర కు వచ్చిన యోగేశ్వరరావు గత నెల 22న తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్ళారు.
మే 24న విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు హెచ్ ఎఫ్ ఎస్ ఎల్ గ్రైనైడ్ బాంబు కిందపడి పేలి యోగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో రాంచి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం యోగేశ్వరరావు ను తరలించారు. అప్పటికే ఆయన కుడిచేయి బాంబు పేలుడు ధాటికి ఛిద్రమవడంతో కుడిచేతిని తొలగించి చికిత్స అందించారు. ఇరవై మూడు రోజులు మృత్యువుతో పోరాడిన యోగేశ్వరరావు ఈనెల 15 రాత్రి తుదిశ్వాస విడిచాడు. అక్కడ గౌరవవందనం సమర్పించిన తర్వాత అక్కడినుంచి శుక్రవారం ఆయన స్వగ్రామానికి భౌతికకాయాన్ని సిఆర్పీఎఫ్ అధికారులు తరలించారు.
జవాన్ కి గౌరవ వందనం
యోగేశ్వరరావు భౌతికకాయం నవతల కూడలి వద్దకు చేరుకోగానే అంతకుముందే జాతీయ జెండాలతో ఉన్న సుమారు 500 మంది యువకులు నవతల కూడలి నుంచి తామర గ్రామం వరకు జాతీయ జెండా చేత పట్టుకొని బైక్ పై ర్యాలీగా వెళ్తూ యోగేశ్వరరావు అమర్ రహే, భారత్ మాతాకీ జై , అఖండ భారతం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. యోగేశ్వరరావు భౌతికకాయాన్ని తామర గ్రామానికి తరలించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో యోగేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. యోగేశ్వరరావు తల్లిదండ్రులు పడాల తిరుపతిరావు, వెంకటమ్మ. వీరికి నలుగురు కుమారులు కాగా అందులో పెద్దవాడు ప్రతాప్ ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు కిరణ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. యోగేశ్వరరావు, ఈశ్వరరావు వీరిరువురు కవల పిల్లలు. వీరిద్దరూ సిఆర్పీఎఫ్ లోనే విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరినీ గ్రామంలో కవల పిల్లలు కావడంతో లవ కుశ లుగా పిలుస్తారు. యోగేశ్వరరావు వీర మరణంతో తామర గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ గ్రామానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు శుక్రవారం అంత్యక్రియల్లో పాల్గొని యోగేశ్వరరావుకు కడసారి నివాళులు అర్పించారు.
CM Jagan:1998 DSC అభ్యర్దులకు జగన్ గుడ్ న్యూస్