ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు. తెలంగాణలో బోనాల (Bonalu festival)పండుగ కనుల పండువగా సాగుతుంది. ఆంధ్రాలో అయితే దేవతా మూర్తులు శాకాంబరులుగా దర్శనం ఇచ్చి భక్తులకు కనువిందు కలిగిస్తారు. కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ (talupulamma ammavaru) అమ్మవారు శాకంబరిగా అవతారం ఎత్తారు. ఆషాడ మాసం సందర్భంగా లోవ తలుపులమ్మ అమ్మవారు ఈరోజు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఆషాఢమాసం అందునా ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ప్రతి ఆషాఢమాసంలో జరిగే అమ్మవారి ఉత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. తుని పరిసర ప్రాంతాల రైతులు తాము పండించే పంటలను,కూరగాయలను అమ్మవారికి అలంకరణగా అందజేస్తారు. తమ పాడిపంటలు పుష్కలంగా పండి, కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించమ్మా అంటూ భక్తులు వేడుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఈ శాకాంబరిగా అమ్మవారి పంచలోహ విగ్రహాల మండపం వద్ద, అలాగే మూలవిరాట్ వద్ద కూరగాయలు, ఆకుకూరలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని భక్తులు తమ మనోనేత్రంతో దర్శించుకుని తన్మయులయ్యారు. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మంగళహారతులు అందజేశారు. ఈ తలుపులమ్మ లోవను దర్శించుకుంటే సకల అభీష్టాలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.
ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని ‘ధారకొండ’ గానూ మరొక దానిని ‘తీగకొండ’ గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య ‘తలుపులమ్మ’ అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రాచీన కాలంలో అగస్త్య ముని ఈ ప్రాంతం సందర్శించారని చెబుతారు. సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది.కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
Gujarat Rains: రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్