పవిత్రమయిన మాఘమాసం సందర్భంగా శ్యామల నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి. శ్రీ దేవీనవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు. నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వీయజ మాసంలో జరుపుకుంటారు. దీనిని ప్రతీక్ష నవరాత్రి అని పిలుస్తారు. మరో రెండు సార్లు నవరాత్రిని ఆషాడ మరియు మాఘ మాసములలో జరుపుకుంటారు. దీనిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి లేదా ఆషాఢంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామల నవరాత్రులని పిలుస్తారు.
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థం నిఘంటువులలో ఉంది. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఎంతో పుణ్యప్రదమైన ఈ మాసంలో ఉన్నన్ని పర్వదినాలు ఇక మరే మాసంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. పరమపవిత్రమైన ఈ మాఘమాసంలో నేటి నుంచి తొమ్మిది రోజులు దేవీ భక్తులు శ్యామల దేవికి పూజలు చేస్తారు.
శ్యామల దేవి అంటే ఎవరు?
మాతంగియే రాజ శ్యామల, శ్రీ లలితా పరాభట్టారికా స్వరూపం కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లియే ఆమె. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలవని భక్తుల విశ్వాసం. ఈ మాసం అమ్మవారి స్తోత్రపారాయణం చేయాలి. అలా చేస్తే అభీష్టాలు నెరవేరుతాయి.
