Nara Lokesh: పిల్లలే మన భవిష్యత్తు.. వారిని తీర్చిదిద్దేది మాత్రం విద్యే అన్నారు మంత్రి నారా లోకేష్.. శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలో ప్రజావేదికపై నిర్వహించారు.. ఉత్తరాంధ్రలోని భామినిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యే అసలైన పునాది అని, అందుకే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజం మనకోసం చాలా చేస్తుంది.. మనం కూడా సమాజానికి ఏదైనా చేయాలి అన్న మాటలు కారా మాస్టార్ వంటి మహనీయుల వల్లే మనలో నాటుకుపోయాయి. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కారా మాస్టార్ సేవలను ఎప్పటికీ స్మరించుకోవాలి అన్నారు.
విద్యాశాఖ మంత్రిగా వచ్చాక మొదటి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమేనని లోకేష్ పేర్కొన్నారు.“పేరెంట్–టీచర్ మీటింగ్‌ల ద్వారా తల్లిదండ్రులను నేరుగా విద్యా వ్యవస్థతో కలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాష్ట్రంలో మూడో పెద్ద మీటింగ్” అన్నారు. పిల్లలే మన భవిష్యత్తు. వారికి విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించటం ఎంతో ముఖ్యం. పిల్లలు అద్భుతంగా మాట్లాడుతున్నారు… వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది” అని చెప్పారు. ఒక తల్లి పట్టుచీరను తాకట్టు పెట్టి చదివించిన తన కుమారుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు రాష్ట్రానికి గొప్ప నాయకుడయ్యారని ఉదాహరణగా చెప్పారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ ర్యాంకును అంగీకరించకపోయినా, విద్య, నైతికతలపై సమాజాన్ని విద్యావంతం చేస్తున్నారని ప్రశంసించారు.
పాఠశాలల్లో రాజకీయాలకు చోటు ఉండదని, ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఓ రేంజ్‌లోకి తీసుకువెళ్తాం.. రాష్ట్రంలో 906 సింగిల్ టీచర్ పాఠశాలలను ఏర్పాటు చేశామని..ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని.. లీప్ యాప్ ద్వారా పిల్లల మార్కులు, హాజరు, ఉపాధ్యాయులు, ఇతర అకడమిక్ వివరాలు తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతి తల్లిదండ్రి ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు చాలా కీలకం అన్నారు మంత్రి నారా లోకేష్..
