NTV Telugu Site icon

Bhumika Reddy: మరణంలోనూ ఐదుగురికి ప్రాణం పోసిన యువ వైద్యురాలు.. శోకసంద్రమైన నంగివాండ్లపల్లి

Bhumika Reddy

Bhumika Reddy

Bhumika Reddy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ భూమికారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు.. సత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్లపల్లికి భూమికారెడ్డి భౌతికకాయాన్ని తరలించారు కుటుంబ సభ్యులు.. తమ గ్రామానికి చెందిన యువ వైద్యురాలు ప్రాణాలు పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. డాక్టర్ భూమికారెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.. ఇక, తాను మరణించాక కూడా అవయవాదానంతో ఐదుగురి ప్రాణాలు కాపాడింది యువ డాక్టర్ భూమికారెడ్డి.. వైద్య వృత్తితో ఎంతోమందికి వైద్య సేవలు, చికిత్సలు అందించిన ఆమె.. ప్రాణాలు పోయిన తర్వాత కూడా అవయవ దానం చేసి ఐదుగురికి పునర్జన్మ ఇచ్చారు.. యువ డాక్టర్ భూమిక రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్యులు, స్నేహితులు.. నంగివాండ్లపల్లి గ్రాస్తులు బరువెక్కిన హృదయాలతో కన్నీటివీడ్కోలు పలికారు..

Read Also: Maha Kumbh Mela: వామ్మో.. ట్రాఫిక్ నరకం.. 300 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు

కాగా, హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్‌గా వైద్య సేవలు అందించిన భూమికారెడ్డి.. ఈ నెల 1వ తేదీన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. హైదరాబాద్‌లో భూమికారెడ్డి ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా.. నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే, వారం రోజుల తర్వాత ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో, గతంలో భూమికారెడ్డి అవయవదానంపై చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. భూమిక అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. భూమికారెడ్డి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి అవసరమైన వారికి అవయమార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు.