Site icon NTV Telugu

గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌తో అన్నీ పేచీలేనా?

ఆ ఎమ్మెల్యేతో అన్నీ పేచీలేనా? పార్టీ నేతలతో గ్యాప్‌ వచ్చిందా? కేడర్‌ విసుగెత్తి దూరం జరిగిందా? లోక్‌సభ ఉపఎన్నికపైనా ఆ ప్రభావం పడిందా? అయినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మార్పు లేదా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయనెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్థానిక వైసీపీ నేతలతో ఎమ్మెల్యేకు విభేదాలు!

నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌. గతంలో తిరుపతి ఎంపీగానూ పనిచేశారు ఈ మాజీ ఐఏఎస్‌. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో గూడూరు నుంచి పోటీ చేసి గెలిచారు. గూడూరు ఎస్సీ రిజర్వ్డ్‌స్థానమైనా.. రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. ఎన్నికల సమయంలో వరప్రసాద్‌కు నియోజకవర్గంలోని వైసీపీ నేతలు సహకరించినా.. తర్వాత వర్గ విభేదాలు వచ్చాయి. ఈ కారణంగానే కొందరు వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారట. ఎమ్మెల్యే వరప్రసాద్‌ వైఖరే దీనికి కారణమన్నది పార్టీ వర్గాలో వినిపిస్తున్నమాట.

అన్నింటిలో ఎమ్మెల్యే కుమారుడి జోక్యం పెరిగిందా?

గూడూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ టికెట్‌ ఆశించి వైసీపీలో కీలంగా పనిచేసిన పారిశ్రామిక వేత్త కనుమూరి హరిశ్చంద్రరెడ్డి తర్వాతకాలంలో పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తీరు నచ్చకే ఆయన వైసీపీని వీడి వెళ్లారని చెబుతారు. పార్టీలో కీలకంగా పనిచేస్తున్న పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, మాజీ సీఎం కుమారుడు నేదురమల్లి రాంకుమార్‌రెడ్డి సైతం వరప్రసాద్‌తో గ్యాప్‌ మెయింటైన్‌ చేస్తున్నారట. నియోజకవర్గంలో బదిలీలు.. పోస్టింగ్‌లు.. కాంట్రాక్టుల.. ఇలా అన్నింటిలో వరప్రసాద్‌ కుమారుడి జోక్యం పెరిగిందట. ప్రతి పనికీ మాకేంటి అని గట్టిగానే నిలదీస్తున్నట్టు గూడూరు వైసీపీలో జరుగుతున్న చర్చ. అందుకే పార్టీలో నేతలతో ఎమ్మెల్యేకు దూరం పెరుగుతుందని అనుకుంటున్నారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గూడూరులో తగ్గిన మెజారిటీ!

ఈ గొడవల వల్లే నామినేటెడ్‌ పోస్టుల ఎంపికలో వరప్రసాద్‌ను వైసీపీ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదని చెవులు కొరుక్కుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయనపై ఫిర్యాదులు తాడేపల్లికి చేరుకుంటున్నాయట. ఈ క్రమంలోనే ఓ మండల వైసీపీ నేత అనుచరులతో కలిసి.. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఆ ఘటన పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. పైగా ఎమ్మెల్యేపై ఉన్న కసిని.. తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికలో చూపించారని చెబుతారు. 2019లో తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థికి గూడూరు అసెంబ్లీలో 46 వేల 381 ఓట్ల మెజారిటీ వస్తే.. 2021 ఉపఎన్నికలో ఆ ఆధిక్యత 36 వేల 347కు పడిపోయింది. మెజారిటీ తగ్గడంపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది.

ఎమ్మెల్యే తీరు మారకపోతే గడ్డురోజులేనని కేడర్‌ ఆందోళన?

మొదట నేతలు.. తర్వాత కేడర్‌.. ఇప్పుడు జనాలు కూడా దూరంగా జరుగుతుండటంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొందట. ఎమ్మెల్యే వరప్రసాద్‌ తన తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గూడూరు వ్యవహారాలపై ఓ కన్నేసిన వైసీపీ పెద్దలు.. పరిస్థితులు చక్కదిద్దేందుకు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.



Exit mobile version