Somireddy Demands To Take Backstep On Meters For Motors: కేంద్రం నుంచి అప్పులు, మీటర్ల కంపెనీల నుంచి కమీషన్లు తీసుకోవడం కోసమే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి, రైతుల గొంతు కోసే కుట్ర చేస్తోందని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చేతనైతే విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన.. మోటార్లకు మీటర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోమని తేల్చి చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిందేనని సీఎం జగన్ పంతం పట్టడం దురదృష్టకరమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టడం ద్వారా.. 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ని పొదుపు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
మోటార్లకు మీటర్లు పెట్టబోమని ప్రకటించిన పొరుగు రాష్ట్రాల సీఎంలను జగన్ చేతకాని వాళ్లని చెబుతున్నారా..? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. మీటర్లు పెట్టాలన్న షరతు విషయంలో కేంద్ర ప్రభుత్వమే వెనకడుగు వేసిందని.. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోరా? అంటూ నిలదీశారు. విద్యుత్ నష్టాలు తగ్గాలంటే.. అవసరాల మేరకు సబ్‌స్టేషన్లు నిర్మించడంతో పాటు ట్రాన్స్ ఫార్మర్ల కెపాసిటీని పెంచమని, అలాగే విద్యుత్ తీగల్ని పటిష్టం చేయమని ఆయన సూచించారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి, బొగ్గు కొనుగోలులోనే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని ఆరోపించారు. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టులో మట్టితో కూడిన బొగ్గును తెచ్చి రూ.700 కోట్లు నష్టం తెచ్చారని.. వారిపై కనీసం చర్యలు తీసుకున్న పాపాన పోలేదని అన్నారు. విద్యుత్ పొదుపుకు చేయాల్సిన పనులు చేయండే తప్ప.. మీటర్లు పెడతాం, బిల్లు ఇస్తాం, డబ్బు కట్టండి, అది తిరిగి చెల్లిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదని అన్నారు.
రైతులకు సున్నా వడ్డీ రుణాల రెన్యూవల్ విషయంలోనూ మోసం చేశారని సోమిరెడ్డి ఫైరయ్యారు. గతంలో అమలులో ఉన్న వ్యవస్థకు విరుద్ధంగా నూతన విధానం తేవడంతో.. అనేక మంది రైతులు డిఫాల్టర్లుగా మారుతున్నారన్నారు. రైతులపై అదనపు వడ్డీ భారం పడుతోందన్నారు. ఆక్వా రైతులను జోన్, నాన్ జోన్ పేరుతో నట్టేట ముంచేశారని ఆగ్రహించారు. యూనిట్‌కి రూ.1.50 మాత్రమే వసూలు చేస్తామని చెప్పి.. ఈరోజు ఆక్వా రైతుల నుంచి రూ.4.85 గుంజుతున్నారన్నారు. రేపు మోటార్లకు మీటర్లు బిగించినా.. ఇలాంటి మోసమే జరుగుతుందన్నారు. ఈ దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, మోటార్లకు మీటర్లను అంగీకరించమని అన్నారు. పునరాలోచన చేసి, మోటార్లకు మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
