అవినీతి చేసే ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం యాప్ ఎందుకు పెట్టలేదు అంటూ వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రభుత్వ అండ లేకుండా ఎవరైనా మైనింగ్ చేయగలరా..? అని ప్రశ్నించారు. ఇసుక అక్రమాల గురించి బొల్లా బ్రహ్మానాయుడు, విత్తన అక్రమాల గురిoచి ఆర్కే మాట్లాడలేదా..? అని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టులోకి లారీలు వెళ్లాలంటే కాకాణి టోల్ కట్టాలని ఆయన ఆరోపించారు. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ బహిర్గతం చేయాలని, మద్యం, ఇసుక, మైనింగులో తనపై వచ్చిన ఫిర్యాదులకు జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలు బహిరంగ అవినీతి చేస్తుంటే యాప్ పేరుతో సీఎం కామెడీ చేస్తున్నారని, అవినీతి ఆరోపణలు వచ్చిన సొంత పార్టీ నేతలు ఎంత మందిపై జగన్ చర్యలు తీసుకున్నారో వివరాలు బయటపెట్టాలన్నారు. అవినీతిలో పుట్టిన మా పార్టీ ద్వారా అవినీతి నిర్మూలన ఎలా సాధ్యమని వైసీపీ నేతలే విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లంచం ఇవ్వటం, తీసుకోవటం నేరం అంటూ సీఎం జగన్ యాప్ ప్రారంభించారని ఆయన ధ్వజమెత్తారు.
