ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు పీఆర్సీ ఇతర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.. తాజగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఏపీ ఎన్‌జీవో రాష్ర్ట అధ్యక్షుడు బండి శ్రీనివాసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల ఉద్యమానికి ఎవరైనా తలవంచాల్సిందేనని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా తమ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. రాష్ర్ట వ్యాప్తంగా 13లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఇంట్లో 5 ఓట్లు ఉంటాయని సుమారు 60 లక్షల ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చవచ్చని ఆయన అన్నారు.
జగన్ మాయ మాటలు నమ్మి 151 సీట్లతో గెలిపిస్తే ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.రైతుల ఉద్యమానికి సైతం ప్రధాన మంత్రి క్షమాపణ చెప్పారన్నారు. అయినా జగన్‌కు బుద్ది రాలేదని, జగన్ దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం తమకు లేదన్నారు. పోరాడి తమ హక్కులను సాధించుకుంటామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీలోపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై లేదా అని ఆయన ప్రశ్నించారు. తాము రాజ్యాంగ హక్కుల ప్రకారమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కొత్తగా ఏం కోరడం లేదని బండి శ్రీనివాసులు అన్నారు.
