Senior Journalist Gopal Reddy Died In Tirupati Ghat Road Accident: తిరుపతిలోని మొదటి ఘాట్ రోడ్డులో చోటు చేసుకున్న ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డి (75) మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం గోపాల్ రెడ్డి ద్విచక్ర వాహనాన్ని డీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆయన అక్కడకక్కిడే చనిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బ్రహ్మోత్సవ కవరేజ్‌లో పాల్గొన్నారు. అది ముగించుకొని తిరిగి వస్తుండగా.. ఈ సంఘటన జరిగింది. గోపాల్ రెడ్డి మృతితో జర్నలిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. గోపాల్ రెడ్డి నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో తనదైన ముద్ర వేశారని, ఎందరో యువ జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. గోపాల్ రెడ్డి ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తన అక్షర ఆయుధాలతో ఆయన అనేక సమస్యలపై పోరాటం చేశారన్నారు. గోపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు.. గోపాల్ రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్ద దిక్కు ఇక లేడన్న విషయం తెలిసి, కన్నీటిపర్యంతమవుతున్నారు. అటు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢీ కొట్టిన ఆ వాహనాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
