NTV Telugu Site icon

పుట్టపర్తి జిల్లా ఏర్పాటు పట్ల రత్నాకర్ హర్షం

ఏపీలో 13 కొత్తజిల్లాలు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గతంలో వున్న 13 జిల్లాలకు ఇవి అదనం. మొత్తం 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. అనంతపురం జిల్లాలో వున్న ప్రముఖ పుట్టపర్తిని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్.

పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు శుభపరిణామం అన్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించడం వల్ల ఉద్యోగ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్ వి జానకీరామయ్య ఆకాంక్ష నెరవేరిందన్నారు రత్నాకర్. జిల్లా ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటన చేయాలి: అమర్‌నాథ్‌ రెడ్డి

అందరి సహకారం వల్లే కల సాకారమైంది. జిల్లా ఏర్పాటుకు సత్యసాయి ట్రస్ట్ ఎల్లవేళలా సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి విమానాశ్రయాన్ని త్వరలోనే వినియోగంలోకి తీసుకొని వస్తాం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం జగన్ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

తాజా ప్రతిపాదనల ప్రకారం పాత జిల్లా కేంద్రాలకు పాత పేర్లే ఉంటుండగా.. కొత్తగా ఏర్పడే జిల్లాలకు కొన్ని జిల్లా కేంద్రాల పేర్లు, మరికొన్నిటికి బాలాజీ, అల్లూరి, సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్, సత్యసాయిబాబాల పేర్లు పెట్టనున్నారు. తిరుపతి కేంద్రంగా ఏర్పడనున్న జిల్లాకు శ్రీ బాలాజీ, విజయవాడ జిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయి.