Chicken Prices: సంక్రాంతి పండుగ అంటే ఇళ్లలో కుటుంబ సభ్యులు, చుట్టాలతో సందడిగా ఉంటుంది. ఇక, నాన్‌వెజ్ వంటకాలలో ముఖ్యంగా చికెన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటి పరుగులు పెడుతుండటం నాన్‌వెజ్ ప్రియులను ఆందోళనకు గురి చేస్తోంది. పండుగ నాటికి డిమాండ్ పెరిగితే ధరలు రూ.350 దాటే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చికెన్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు, పేదలు చికెన్ కొనాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. కాగా, ప్రస్తుతం మార్కెట్లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.350 వరకు ఉంది. దీంతో తొలిసారిగా చికెన్ కిలో ధర రూ.350 దాటిందని షాప్స్ యజమానులు పేర్కొంటున్నారు.
అయితే, గతంలో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.200గా ఉండేది.. కానీ, ఇప్పుడు అదే చికెన్ ధర రూ.350కు చేరుకుంది. అలాగే, గతంలో స్కిన్‌తో కూడిన చికెన్ కిలో రూ.240కే లభించగా, ప్రస్తుతం అది కూడా రూ.300కి పైగా అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం చికెన్ కిలో ధర రూ.310గా ఉంది. ఇక, ధరల పెరుగుదలతో నాన్‌వెజ్ మార్కెట్లలో ఆదివారం సందడి భారీగా తగ్గింది. గతంలో సండే వస్తే చికెన్ షాపుల దగ్గర పెద్ద ఎత్తున క్యూలు కనిపించేవి.. కానీ, ఇప్పుడు మాత్రం కస్టమర్లు లేక పలు షాపులు వెలవెలబోతున్నాయి.
Read Also: MSVG : ‘మన శంకరవరప్రసాద్‌గారు’ క్లైమాక్స్ లీక్.. చిరు–వెంకీల ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
ఇక, ఏపీలో ధరలు ఎక్కువైనా నాటు కోడికి మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఆరోగ్య పరంగా మంచిదని భావించే వారు నాటు కోడిని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అక్కడ కూడా ధరలు పెరగడంతో వినియోగదారులు ఆలోచనలో పడ్డారు. మొత్తంగా ఈసారి సంక్రాంతి పండుగకు చికెన్ కూర సామాన్యులకు కలగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ధరలు తగ్గకపోతే పండుగ మెనూలో మార్పులు తప్పవని వినియోగదారులు పేర్కొంటున్నారు.
