Site icon NTV Telugu

త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు.. నిర్మాణాలు చేపడతాం: ఎంటీ కృష్ణబాబు


త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు.. నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆర్‌ అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సీఎం సూచనల మేరకు ముందుగా రోడ్ల మరమ్మత్తులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 2,205 కోట్లు కేటాయించింది. రోడ్లను బాగు చేసేందుకు నిధులను సమీకరిస్తున్నాం. రోడ్ సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఎస్క్రో చేసి అప్పు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 8,268 కి.మీ పొడవు రోడ్లను మెరుగుపరచడానికి.. 308 స్టేట్ హైవే రోడ్లను రూ. 923 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన తెలిపారు.

జిల్లాల్లోని మేజర్ రోడ్లను రూ. 1,282 కోట్లతో చేపట్టాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు ఆహ్వానించినట్టు వెల్లడించారు. 328 రోడ్లకు రూ. 604 కోట్ల విలువైన పనులు అప్పగించి అగ్రిమెంట్ చేసుకున్నాం. మిగిలిన 819 పనులకు, రూ. 1,601 కోట్ల వ్యయంతో, త్వరలో టెండర్లు ఆహ్వానిస్తాం. వచ్చే నెల మూడో వారంలోగా రోడ్ల పనులను ప్రారంభిస్తాం. ఇప్పటికే అప్పగించిన పనులు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమవుతాయని తెలిపారు.

ఈ పనులను చేపట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే రూ. 2,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసిట్టు తెలిపారు. వచ్చే మొదటి వారంలోగా బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా ఈ పనులన్ని 2022 చివరి నాటికి పూర్తి అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు ఎంటీ కృష్ణ బాబు తెలిపారు. ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఎప్పటి నుంచో జగన్‌ ప్రభుత్వం పై అటు ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపణలు చేస్తున్న విషయం విధితమే.

Exit mobile version